Take a fresh look at your lifestyle.

చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు…: భట్టివిక్రమార్క

0 2,631

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదని… వారు సహచరులేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ఏపీ సీఎంగా, రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నారన్నారు. వారిద్దరి మధ్య గురుశిష్యుల సంబంధం ఉందని చెప్పేవారివి అవగాహన లేని మాటలు అన్నారు.

ఆరు గ్యారెంటీలు అమలు చేశాం

అనుకున్న సమయం కంటే ముందే తాము ఆరు గ్యారెంటీలను అమలు చేశామని భట్టివిక్రమార్క అన్నారు. త్వరలో రైతు రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకుంటామన్నారు. ఒక లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ఐదేళ్లు అయినా హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. కానీ ఇప్పుడు మాత్రం రుణమాఫీ ఎప్పుడు చేస్తారని తమను అడగడం విడ్డూరంగా ఉందన్నారు.

రైతుబంధును తాము రైతుభరోసాగా మార్చినట్లు చెప్పారు. రైతు భరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీలో తమ సొంత నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలు కట్టిన పన్నులతోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కట్టిన ప్రతి పైసా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలన్నారు. సంపదను సృష్టించి ప్రజలకు పంచాలనేదే తమ ఆలోచన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.