Take a fresh look at your lifestyle.

ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ సమస్యలు పట్టవా?

0 37
– తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ఆ ప్రభుత్వ శాఖ అత్యంత కీలకం.

– ప్రభుత్వ ఖజానాకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే ఆ డిపార్ట్‌మెంట్‌ గత కొన్నేళ్లుగా ఎలాంటి స్థితిలో ఉంది ?

– ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఎలా ఉన్నారు ?

– ఆదాయం తప్పించి ఆదరణ అందుకోలేకపోతున్న ఆ శాఖ ఏంటి ?

– ఎందుకిలా ఆ ప్రభుత్వ శాఖ నిర్లక్ష్యానికి గురవుతోంది ?

తెలంగాణాన్ని బంగారు తెలంగాణగా మార్చింది ఎక్సైజ్‌ శాఖనే. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే ఆదాయం కన్నా ఎక్సైజ్‌ నుంచి వచ్చే భారీ ఆదాయంతోనే ప్రభుత్వ ఖజానా నిండుతోంది. అలాంటి ఈ శాఖని పాలకులు పట్టించుకోవడం లేదు. ఆదాయం చూస్తున్నారే కానీ ఆదరణ చూపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మాటలంటోంది ఎవరో కాదు ఎక్సైజ్‌ శాఖనే. అందుకు కారణం ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరేనంటున్నారు ఉద్యోగులు.

పోలీస్‌ శాఖకు ధీటుగా ఎక్సైజ్‌ శాఖ పనిచేస్తోంది. కానీ కనీసం పోలీసులకు ఇచ్చే సౌకర్యాలు కూడా ఎక్సైజ్‌ సిబ్బందికి లేవు. మూడు నుంచి 5 మండలాల పరిధిలో ఒక్కో స్టేషన్‌ ఉంటుంది. ఈ స్టేషన్ ల‌లో 10మందికి పైగా ఎక్సైజ్‌ సిబ్బంది పనిచేస్తుంటారు. ఆరుగురు కానిస్టేబుళ్లు, ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, ఇద్దరు ఎస్సైలు, ఒక సిఐ పనిచేస్తుంటారు. ఇంతమంది సిబ్బందికి తగిన విధంగా స్టేషన్లలో సౌకర్యాలు లేవు. చెప్పుకుంటే సిగ్గుచేటు సరైన వాహనాలు కూడా లేవు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కో స్టేషన్‌ కి ఒక్క వాహనం తప్పించి మరో వెహికల్‌ లేదు. ఏదైనా కేసు నిమిత్తం బయటకు వెళ్లాంటే సిబ్బంది సొంత వాహనాలను వాడాల్సిందే.లేదంటే అద్దె వాహనాలను ఉపయోగించాల్సిందే. పోనీ ఈ వెహికల్స్‌ కిరాయి అయినా పక్కగా ప్రభుత్వం చెల్లిస్తోందా అంటే అదీ లేదు. తుప్పుపట్టి, కాలంచెల్లిన వాహనాల్లోనే తనిఖీలు చేస్తూ క్రిమినల్స్‌ ని పట్టుకోవాల్సిన పరిస్థితిలో ఎక్సైజ్‌శాఖ ఉంది.

వాహనాలు మాత్రమే కాదు ఇప్పటివరకు ఎక్సైజ్‌ శాఖకి సొంత భవనాలు లేవు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్‌ కార్యాలయాలన్నీ పాత బిల్డింగుల్లో, కూలిపోయే స్థితిలో ఉన్న వాటిల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అద్దె భవనాలకు వాటి కిరాయి కూడా కట్టలేని స్థితిలో ఉంది. 6నెలలకు ఒకసారి కూడా అద్దె ఇవ్వ‌డం లేదు…. దయ నీయ పరిస్థితి లో డిపార్ట్‌మెంట్‌ ఉంది…మ‌రోవైపు య‌జ‌మానులు భ‌వ‌నాల‌ను కాళీ చేయమని బెదిరిస్తున్న పరిస్థితి క‌న‌ప‌డుతుంది. ఇంకోవైపు స్టేషన్ మెయింటెనెన్స్‌ నిధులు కూడా సాంక్షన్ కావడం లేదని సిబ్బంది వాపోతున్నారు.

ఇక ఉద్యోగుల కష్టాలు వర్ణనాతీతం. ఈ శాఖలో పనిచేసే సిబ్బందికి టిఏ బిల్లులనే కాదు చివరకు యూనిఫాం అలవెన్సులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు చివరకు తెలంగాణ వచ్చి 10 ఏళ్లైనా ఇప్పటివరకు ఎక్సైజ్‌ శాఖని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం సంక్షేమ, అభివృద్దికి అయ్యే నిధుల్లో అత్య‌ధిక భాగం ఎక్సైజ్ రాబ‌డి నుండే వ‌స్తుంద‌నే దాంట్లో సందేహం లేదు.

ఈ శాఖ నుంచి పాలకులు భారీగా ఆదాయాన్నిఆశిస్తున్నాయే కానీ మా కష్టాలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదని ఎక్సైజ్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2010 సంవ‌త్స‌రంలో రూ.10వేల కోట్లు వున్న ఆదాయం ఈరోజు రూ.40వేల కోట్లకు ఆదాయం పెరిగినప్ప‌టికీ డిపార్ట్మెంట్ కు కనీస సౌకర్యాలు కూడ గ‌త‌ ప్ర‌భుత్వాలు సమకూర్చలేద‌ల‌ని, సొంత భవనాలు,వాహనాలతో పాటు సిబ్బందికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. యూనిఫాం సర్వీస్‌ కాబట్టి బయటకు చెప్పుకోలేక కష్టాలను లోలోపలే భరిస్తూ విధులు నిర్వహిస్తోన్న ఎక్సైజ్‌ శాఖకు ఈ కాంగ్రెస్‌ పాలనలోనైనా న్యాయం జరగాలని ఉద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

Excise
ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ సమస్యలు పట్టవా?

Leave A Reply

Your email address will not be published.