- 2,629 ఎస్ఏ, 6,508 ఎస్జీటీ పోస్టుల భర్తీ
- గతంలో జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు
- గతంలో దరఖాస్తు చేసుకున్నవాళ్లు మళ్లీ చేసుకోనక్కర్లేదని వివరణ
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏకంగా 11,062 పోస్టులతో జారీ అయిన ఈ నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 ఉండగా.. ఎస్జీటీ పోస్టులు 6,508 ఖాళీలు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులు ఉన్నాయి.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రేవంత్ రెడ్డి సర్కారు రద్దు చేసింది. గతేడాది సెప్టెంబర్ 6న 5,089 పోస్టులతో బీఆర్ఎస్ ప్రభుత్వం నియామక ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఈ నోటిఫికేషన్ ను రద్దు చేసి, అదనంగా 5 వేల పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులతో రేవంత్ రెడ్డి కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదని సీఎం స్పష్టతనిచ్చారు. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.