Take a fresh look at your lifestyle.

మాకు అంతా తెలుసు.. నిష్పక్షపాతంగా ఉండలేమనుకుంటే తప్పుకోండి: కేంద్ర ఎన్నికల సంఘం

0 220
  • నకిలీ ఓట్ల వ్యవహారంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం తీవ్ర ఆగ్రహం
  • చర్యలు తీసుకునే దాకా తెచ్చుకోవద్దని వార్నింగ్
  • అర్హుల ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసిన అధికారులు
  • పార్టీలకు కొమ్ముకాసే అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించిన అధికారులు

ఏపీలో ఓటరు నమోదులో అక్రమాలు జరిగాయంటూ వ్యక్తమవుతున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఓటర్ల లిస్ట్ తయారీ, ఎన్నికల ప్రక్రియలో తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండలేమని భావిస్తే విధుల్లో తప్పుకోవాలని అధికారులను ఎన్నికల సంఘం హెచ్చరించింది. తాము చర్యలు తీసుకునే పరిస్థితిని కల్పించుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది. అర్హుల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో వేలల్లో ఫాం-7 దరఖాస్తులు వస్తుంటే బాధ్యులపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడంలేదని అధికారులను గట్టిగా ప్రశ్నించింది.

ఈ మేరకు  రాష్ట్రంలో ఎన్నికల కసరత్తు, ఓటర్ లిస్ట్ తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌, కమిషనర్లు అరుణ్‌ గోయల్‌, అనూప్‌చంద్ర పాండేలతో కూడిన ప్రతినిధి బృందం విజయవాడ నోవాటెల్‌ హోటల్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించింది. మంగళవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వివిధ పార్టీల నేతలతో సీఈసీ బృందం భేటీ అయ్యింది. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. అనంతరం మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందో మాకు తెలుసు..

ఎవరెవరు ఏవిధంగా నడుచుకుంటున్నారో, ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందో తమకు తెలుసు అని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రతి అధికారికి సంబంధించిన రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని ఎన్నికల సంఘం అధికారులు సీరియస్ అయ్యారు. కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించింది. కొంతమంది అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని, పార్టీలు, నాయకులతో అంటకాగుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. పార్టీలకు కొమ్ముకాచే అధికారులను ఉపేక్షించేది లేదని ఎన్నికల సంఘం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అధికారి అయినా ఏదైనా పార్టీకి లేదా నేతలకు అనుకూలంగా నడుచుకుంటే బాధ్యులపై కఠిన చర్యలుంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.

సూత్రధారులు ఎవరో ఎందుకు తేల్చట్లేదు?

ఓట్ల తొలగింపుతో లబ్ది పొందాలనుకుంటున్నది ఎవరనే అంశంపై ఎందుకు దర్యాప్తు చేయడంలేదని పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఎన్నికల సంఘం ప్రతినిధులు ప్రశ్నించారు. కేసులు నమోదుచేసి వదిలేస్తే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. సూత్రధారులను ఎందుకు వదిలేస్తున్నారని పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఎన్నికల సంఘం బృందం నిలదీసింది. ఏపీలో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగింపు కోసం తప్పుడు సమాచారం, వివరాలతో ఫాం-7 దరఖాస్తులు సమర్పిస్తున్నవారి వెనుక ఎవరున్నారనేది ఎందుకు గుర్తించడంలేదని నిలదీశారు. తాము ప్రతి కేసునూ పరిశీలిస్తామని, బాధ్యుల్ని తప్పించినట్లు ఎక్కడైనా తేలితే చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిచారు. అర్హుల ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లు చేర్చేందుకు కారణమైన వారిపై కేసులు పెట్టాల్సిందేనని హెచ్చరించింది.

మరోవైపు తిరుపతిలో దొంగ ఓట్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆ జిల్లా కలెక్టర్‌ కే.వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డిని అధికారులు నిలదీశారు. వీరిద్దరి వివరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అనంతపురం జిల్లా కలెక్టర్‌ ఎం.గౌతమి, కాకినాడ కలెక్టర్‌ కృతికా శుక్లా, కడప కలెక్టర్‌ విజయరామరాజు, బాపట్ల కలెక్టర్‌ రంజిత్‌బాషాపై కూడా సీఈసీ కమిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం, తనిఖీల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటాపై సీఈసీ బృందం మండిపడింది.

Leave A Reply

Your email address will not be published.