లక్షల కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజీ అక్టోబరు 21న కుంగితే డిసెంబరు 7 వరకు కేసీఆర్ సీఎంగానే వున్నారనీ, అయినా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ ఘటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి బయలుదేరివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రాజెక్టులకు జరిగిన నష్టానికి కట్టిన వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల ఇప్పుడు ఎస్ఆర్ఎస్‌పీ ఆయకట్టు మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డను సందర్శించి పరిస్థితిని అంచనా వేస్తామన్నారు. నష్టం తక్కువగా ఉండాలనే తాము కోరుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.