- పార్టీలో కీలక పదవీ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానం
- మహేశ్వరం టికెట్ ఆశించిన పారిజాతకు కన్వీనర్ పదవి
- 15 మంది కన్వీనర్లను ప్రకటించిన కాంగ్రెస్
బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతికి పార్టీలో కీలక పదవి దక్కింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలలోకి రాములమ్మని పార్టీ తీసుకుంది. ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, ప్లానింగ్ కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించింది. కాగా మాజీ ఎంపీ విజయశాంతి శుక్రవారం తిరిగి కాంగ్రెస్ గూటిలో చేరారు. హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. మరోవైపు మహేశ్వరం టికెట్ ఆశించిన పారిజాతకు కూడా కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. మొత్తం 15 మంది కన్వీనర్లను ప్రకటించారు. ఈ జాబితాలో సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లురవి, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్, అలీబిన్ ఇబ్రహీం మస్కతి, దీపక్ జాన్, ఓబెద్దుల కోత్వాల్, రామ్మూర్తి నాయక్‌తోపాటు పలువురు ఉన్నారు.
కాగా శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయశాంతి మీడియాతో మాట్లాడనున్నారని సమాచారం. కీలక ప్రెస్‌మీట్‌లో ఆమె ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా పార్టీలో చేరిన సందర్భంగా విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కే పరిమితం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌లో చేరినట్లు ఆమె పేర్కొన్నారు.