Take a fresh look at your lifestyle.

నా వ్యక్తిగత ఆర్థిక అంశాల్లో లోపాల కోసం వెతుకుతున్నారు: లోక్‌సత్తా జేపీ

0 82
  • పాత పెన్షన్ విధానంపై పోరాడుతున్న లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్
  • తనకు ప్రభుత్వం నుంచి పెన్షన్ రాదని వెల్లడి
  • పెన్షన్ వచ్చేదాకా కూడా ఆగకుండా రాజీనామా చేసినట్టు వివరణ
  • ఆర్థిక వ్యవహారాల్లో తనవల్ల ఒక్క పొరపాటు కూడా జరగలేదని స్పష్టీకరణ

పాత పెన్షన్ విధానం.. దేశానికి, భవిష్యత్ తరాలకు ప్రమాదకరమని లోక్‌సత్తా, ఫెడరేషన్ ఆఫ్ డెమాక్రెటిక్ రీఫార్మ్స్ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయాణ తరచూ చెబుతుంటారు. ఓపీఎస్ వల్ల ప్రస్తుత, రాబోయే తరాల పన్ను చెల్లింపుదారులపై పెను ప్రభావం పడుతుందని ఎప్పటి నుంచో హెచ్చరిస్తుంటారు. ఈ విషయాన్ని గణాంకాలతో సహా పలు సందర్భాల్లో వివరించారు. మరి స్వయంగా మాజీ ఐఏఎస్ అయిన జేపీ పెన్షన్ పరిస్థితి ఏమిటి? ఆయన పెన్షన్ తీసుకుంటారా? జేపీ నిజాయతీ ఆయన మాటల్లోనేనా? చేతల్లో కూడానా?.. ఇవి జేపీ మాటలు విన్న ప్రతిసారీ అనేక మంది మదిలో కలిగే సందేహాలు. ఈ అంశాలపై జేపీ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వివరించారు.

తను రాజీనామా చేయబోయే ముందు చీఫ్ సెక్రటరీ కనీసం పెన్షన్ వచ్చే వరకైనా ఉద్యోగంలో కొనసాగమని తనకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారని జేపీ తెలిపారు. ఈ సమయంలో ఆఫీసుకు కూడా రావాల్సిన అవసరం లేదని, అప్పటికే తనకు ఉన్న సెలవులను వినియోగించుకోవాలని సూచించినా తాను తిరస్కరించానని అన్నారు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కూడా తీసుకోలేదని వివరించారు. అయితే, మాజీ శాసనసభ్యుడిగా తనకు ఓ ఫిక్స్‌డ్ మొత్తం వస్తుందని, అది ఓపీఎస్ లాంటిది కాదని ఆయన స్పష్టం చేశారు. కావాలంటే అది కూడా ఉపసంహరించుకోవచ్చని అన్నారు. చట్ట బద్ధంగా వస్తున్న పెన్షన్ తీసుకునే వారిని తాను తప్పుపట్టట్లేదని జేపీ స్పష్టం చేశారు. అయితే, భవిష్యత్తు తరాలకు ఓపీఎస్‌ ఓ సమస్య అని తెలిసీ ఇస్తున్నవారిని తాను తప్పుపడుతున్నట్టు చెప్పారు.

ప్రభుత్వం తనకు ప్రశాసన్ నగర్‌లో స్థలం మంజూరు చేసినా తాను తిరస్కరించినట్టు తెలిపారు. అప్పట్లో స్థలం విలువ 4-5 కోట్లు ఉండేదని ఇప్పుడు దాని విలువ 15 కోట్లకు చేరిందని చెప్పారు. అయితే, దీన్ని ఓ త్యాగంగా తాను ఏనాడూ భవించలేదు కాబట్టే ఇప్పటివరకూ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని జేపీ అన్నారు. దేశం కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఇది తాను పెట్టిన పెట్టుబడి అని వ్యాఖ్యానించారు. ఈ 27 ఏళ్లలో లోక్‌సత్తా లేదా ఇతర కార్యక్రమాలకు తాను, తన సహచరులు పైసా జీతం తీసుకోకుండా పనిచేశామని జేపీ అన్నారు. తన జీవితంలో లోపాలను వెతికి ఆయుధంగా వాడుకోవాలన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఫలితంగా, అసలు సమస్య నుంచి దృష్టి మళ్లుతుండటంతో వ్యక్తిగత విషయాలు పంచుకోవాల్సి వచ్చిందని జేపీ వివరించారు.

ఫౌండేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రీఫార్మ్స్ నిధులపై కూడా జేపీ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ నిధులు, వ్యవస్థాగత విరాళాలు( ట్రస్టులు, ఫండ్స్ వంటివి), విదేశీ నిధులు తీసుకోమని స్పష్టం చేశారు. వ్యక్తులు స్వయంగా ముందుకు వచ్చి ఏ రకమైన షరుతులు లేకుండా ఇచ్చే నిధులనే తీసుకుంటామని వివరించారు. గతంలో విదేశాల్లోని భారత సంతతి వారి నుంచి మాత్రమే విరాళాలు తీసుకునే వాళ్లమని, ఇప్పుడు అది కూడా ఆపేశామని చెప్పారు. ఈ సంస్థలో ఉన్న వాళ్లమే తలోకాస్తా వేసుకుని నిధులు సమకూర్చుకుంటున్నామని, జీతాల్లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు. ఫలితంగా, ఈ 27 సంవత్సరాల్లో తాను రూపాయితో పది రూపాయల పని ఎలా చేయాలో నేర్చుకున్నట్టు చెప్పారు.

డబ్బుల విషయంలో తనపై ఒక్క విమర్శ అయినా వచ్చిందేమో చెప్పమని జేపీ సవాలు చేశారు. వాళ్లూవీళ్ల దగ్గర డబ్బులు అడగడం గానీ, ప్రభుత్వ నిధుల కోసం ప్రయత్నించడం గానీ తాను అస్సలు చేయలేదని తెలిపారు. ఏ కార్యక్రమానికైనా డబ్బు అవసరం కాబట్టి..విరాళాలు తీసుకుని దానికి రిసీట్, పన్ను రాయతీ సర్టిఫికేట్ కూడా ఇస్తామని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో దేశంలో భారీ మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. మూడు రాజ్యాంగ సవరణలు, ఏడెనిమిది పెద్ద పెద్ద చట్టాలు, పెద్ద విధానాల్లో నాలుగైదు మార్పులను తీసుకొచ్చిన సంస్థ గత 50 ఏళ్ల ప్రపంచ చరిత్రలో మరొకటి లేదని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.