- గతంలో ప్రజా ఉద్యమాన్ని తక్కువ అంచనా వేశామన్న చిదంబరం
- అమరవీరుల చావుకు తమదే బాధ్యత అని వెల్లడి
- తప్పు జరిగిపోయింది క్షమించాలంటూ వ్యాఖ్యలు
- మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదంటూ కవిత ఆగ్రహం
గతంలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ ను తక్కువగా అంచనా వేశామని, ఉద్యమకారుల మరణానికి తమదే బాధ్యత అని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించడం తెలిసిందే. తప్పు జరిగిపోయింది అంటూ ఆయన క్షమాపణలు తెలిపారు. అయితే, చంపినవాడే సంతాపం తెలిపినట్టుంది అంటూ చిదంబరం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా చిదంబరం క్షమాపణ వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. గ్యారెంటీలు ప్రకటించడానికేమో గాంధీలు వస్తారా… క్షమాపణలు చెప్పడానికేమో బంట్రోతులను పంపిస్తారా…? 6 దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ కూడా చెప్పలేరా…? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం. ఈ గడ్డపై జోడో యాత్రలు చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ అనకపోవడం దారుణం. ఈ రోజుకీ మీకు అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం. సోనియా, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు” అని కవిత తీవ్రస్థాయిలో స్పందించారు.