- కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామన్న అద్దంకి దయాకర్
- కాంగ్రెస్‌ను వీడే నేతలంతా ఓడిపోయే పార్టీలోకి వెళ్తున్నారన్న కాంగ్రెస్ నేత
- బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోతుందని వ్యాఖ్య
తనతో సహా అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోని నేతలమందరం కలిసి… పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఆయన తుంగతుర్తి కాంగ్రెస్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్ మరొకరికి టిక్కెట్ కేటాయించింది. అయినప్పటికీ అద్దంకి దయాకర్ స్పోర్టివ్‌గా స్పందిస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… తనకు టికెట్ రాలేదని చాలామంది ఫోన్ చేశారని, తనకు టికెట్ రాకున్నా, పార్టీ గెలుపు కోసం పని చేస్తానని చెప్పారు. పార్టీలో మాల, మాదిగలు అన్నదమ్ములలా ఉంటామన్నారు.
2014లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల రోజులకే తనకు టిక్కెట్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో తాను ప్రచారం చేస్తానన్నారు. టికెట్ రాని నేతలమందరం కలిసి 12 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామన్నారు. కాంగ్రెస్‌ను వీడే నేతలంతా ఓడిపోయే పార్టీలోకి వెళ్తున్నారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయి కారి ఒప్పందం ఉందన్నారు. బీఆర్ఎస్ మీటింగ్‌లకు లేని నిబంధనలు కాంగ్రెస్‌కే ఎందుకు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోతుందన్నారు. హంగ్ కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు.