Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మా పార్టీ పని చేస్తుంది: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

0 135
  • బాలరాజుపై దాడి నెపాన్ని కాంగ్రెస్‌పై నెట్టడం సరికాదన్న చాడ వెంకటరెడ్డి
  • తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
  • ప్రజల్లో కాంగ్రెస్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందన్న చాడ వెంకటరెడ్డి

అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై జరిగిన దాడి ఘటన మీద విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… బాలరాజుపై దాడి నెపాన్ని కాంగ్రెస్ పార్టీపై నెట్టడం సరికాదన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలే కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు అవుతున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం తమ పార్టీ పని చేస్తుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారని, ఈ రెండు స్థానాల్లో అత్యధిక నామినేషన్లు దాఖలు అయ్యాయని గుర్తు చేశారు. ఆయన పోటీ చేసే స్థానాల్లో అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయంటే కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనకు ఇది అద్దం పడుతోందన్నారు.

Leave A Reply

Your email address will not be published.