- అశ్వారావుపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్
- ఓటు వేయడానికి ముందు అభ్యర్థులు, పార్టీల మంచి, చెడును చూడాలని సూచన
- ఎన్నికలు వస్తుంటాయి… పోతుంటాయి… కానీ ప్రజలు ఆగం కాకుండా ఆలోచించి ఓటేయాలన్న కేసీఆర్
2004లో రావాల్సిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అశ్వారావుపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ… ఓటు వేయడానికి ముందు అభ్యర్థులు, పార్టీల మంచి, చెడును, గుణాన్ని చూడాలన్నారు. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్ర, వాటి నడవడిక, అధికారమిస్తే ఏం చేస్తారు? పేదలు, రైతుల పట్ల వారి తీరు ఎలా ఉంది? అని ఆలోచించాలని సూచించారు. అలా చూస్తేనే నాయకుడు గెలవడం కంటే ప్రజలు గెలుస్తారన్నారు. తెలంగాణ వచ్చాక మొదటిసారి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, ఆ సమయంలో కరెంట్ సమస్య ఉండేదని, ఇప్పుడు దానిని పరిష్కరించుకున్నామన్నారు.
కులం, మతం బేధం లేకుండా అందర్నీ సమానంగా చూస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. అందుకే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రైతులు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చామన్నారు. ఎన్నికలు వస్తుంటాయి… పోతుంటాయి.. కానీ ప్రజలు ఆగం కాకుండా ఆలోచించి ఓటేయాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడానికి ఎన్ని ఇబ్బందులుపడ్డామో మనందరికీ తెలిసిందేనన్నారు. ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది… ఉద్యమాలను అణిచివేసింది… ఎప్పుడో రావాల్సిన తెలంగాణను ఆలస్యం చేసింది.. ఇవన్నింటికి కాంగ్రెస్ కారణమన్నారు.
గోదావరిపై సీతారామ ప్రాజెక్టు కట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వవచ్చునని ఏ కాంగ్రెస్ నేత గతంలో ఆలోచన చేయలేదన్నారు. కానీ మన ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే 70 శాతం పూర్తయిందని, ఇది పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. ధరణి పోర్టల్‌లో గోల్‌మాల్‌కు ఆస్కారం లేదన్నారు. రైతుల పట్ల సానుభూతిలేని కాంగ్రెస్ నేతలు ధరణిని తీసేస్తామంటున్నారన్నారు. అదే జరిగితే రైతుబంధు సహా ఇతర పరిహారాలు వారికి ఎలా అందుతాయి? అని ప్రశ్నించారు.