Take a fresh look at your lifestyle.

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నాం: యనమల

0 121
  • లూటీ కోసమే అప్పులు చేస్తున్నారన్న యనమల
  • క్లాసిక్ డెట్ ట్రాప్ లోకి వెళుతోందని చెబుతున్నా వినలేదని ఆవేదన
  • బుగ్గన అబద్ధాలకు అలవాటుపడ్డారని విమర్శలు

వైసీపీ ప్రభుత్వం లూటీ కోసమే అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్ధిక వ్యవస్థను ఊబిలోకి నెట్టిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రాష్ట్రం క్లాసిక్ డెట్ ట్రాప్‌లోకి వెళుతోందని గత నాలుగేళ్లుగా ఏకరవు పెడుతున్నా ప్రతిపక్షాలపై విరుచుకుపడటం తప్ప ఏమాత్రం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవ ఆర్ధిక పరిస్థితిని విశ్లేషించకుండా పదేపదే అబద్దాలను వల్లెవేస్తున్నారని యనమల మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కాగ్, క్రిసిల్ లాంటి సంస్థలు తీవ్రంగా హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం అబద్దాలను ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు.

“ఈ ఏడాది ఆగష్టు నెలలో దాయిష్ బ్యాంకు ముఖ్య ఆర్ధికవేత్త కౌశిక్ దాస్ తన నివేదికలో రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థల్లో ఏపీ 8వ స్థానం నుంచి 11 వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. నిన్న క్రిసిల్ రేటింగ్ సంస్థ అమరావతి బాండ్ల రేటింగ్‌ను తగ్గించింది. చేబదుళ్లు, ఓవర్ డ్రాప్ట్‌లతోనే ఆర్ధిక నిర్వాహణ చేసే స్థితికి దిగజారిందని చెప్పింది. జగన్ రెడ్డి దోపిడీ, దుబారాల వల్లే నేడు రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించింది.

ప్రభుత్వ గ్యారెంటీలతో కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పుల సమాచారం కాగ్ అడిగినా ఆ లెక్కలు వెల్లడించడం లేదు. పబ్లిక్ అకౌంట్ నుంచి ఎంత మొత్తం రుణం ప్రభుత్వం వినియోగించుకుంటుందో కూడా చెప్పడం లేదు. వైసీపీ ప్రభుత్వం వెల్లడిస్తున్న కుట్రపూరిత గణాంకాలను రాష్ట్రం ఆవిర్భవించాక ఎన్నడూ చూడలేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై, తలసరి ఆదాయంపై, అప్పులపై తప్పుడు లెక్కలను నిస్సిగ్గుగా పుస్తకాలు వేసి ప్రచారం చేస్తోంది.

2019-20 లో వృద్ధిరేటు ఎక్కువగా చూపించుకోవడం కోసం టీడీపీ హయాంలో సాధించిన వృద్ధిరేటును తారుమారు చేశారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.6,80,332 కోట్లు (11.02 శాతం) స్థూల ఆదాయం అని ముందస్తు అంచనాల్లో ప్రకటించి 2018-19 ఆర్ధిక సర్వే విడుదల చేశారు. ఈ జీడీపీని రూ.6,21,301 కోట్లకు (4.45 శాతం) కుదించి 2019-20 ఎకనామిక్ సర్వేలో చూపించారు. 2018-19లో టీడీపీ సాధించిన జీడీపీ కన్నా 2019-20 లో రూ.53,718 కోట్లు తగ్గించి 11.02 శాతం వృద్దిరేటును 5.36 శాతంకు కుదించారు.

2020-21లో కోవిడ్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైన నేపథ్యంలో దేశంలోనూ, రాష్ట్రంలోనూ నెగెటివ్ వృద్ధిరేట్లు నమోదయ్యాయి. కానీ, వైసీపీ ప్రభుత్వం మాత్రం రొయ్యలు, చేపలు ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో నిలిచిందని తప్పుడు లెక్కలు చూపింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు నిలిచిపోయి దారుణమైన పరిస్థితులు నెలకొంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏకంగా రూ.40 వేల కోట్లు మేర రొయ్యల ఎగుమతులు జరిగాయని నిస్సిగ్గుగా అబద్దాలు వల్లెవేసింది. ఈ తప్పుడు లెక్కలపై, రాష్ట్ర ఆర్ధికస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి బహిరంగ చర్చకు రావాలని పిలిచినా వైసీపీ నుంచి ఎటువంటి స్పందన లేదు” అంటూ యనమల పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.