- అక్కినేని తమకి స్వేచ్ఛను ఇచ్చారన్న వెంకట్
- తాను .. నాగ్ ఇండస్ట్రీలో పెరగలేదని వ్యాఖ్య
- సినిమాలకి దూరంగా ఉండేవారమని వెల్లడి
అక్కినేని నాగేశ్వరరావు తనయుడు వెంకట్ అక్కినేని, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అనేక సినిమాలను నిర్మించారు. తనపని తాను చేసుకుంటూ వెళ్లే ఆయన, మొదటి నుంచి కూడా మీడియాకి దూరంగానే ఉంటూ వచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
“నేను .. నాగార్జున ఇద్దరం కూడా ఇండస్ట్రీలో పెరగలేదు. మేము బాగా చదువుకోవాలని చెప్పి, మమ్మల్ని నాన్నగారు ఇండస్ట్రీకి దూరంగానే ఉంచుతూ వచ్చారు. అందువలన అప్పట్లో సినిమాలను గురించి మాకు ఏమీ తెలిసేది కాదు. సినిమాలకి సంబంధించిన ఆలోచనలను నాన్నగారు మాపై రుద్దే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేసేవారు కాదు” అని అన్నారు.
“నేను నిర్మాతగా మారడానికీ .. నాగార్జున హీరో కావడానికి కూడా భయపడుతూనే నాన్నగారి దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్పాము. అప్పుడు మాత్రం ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. ఆ తరువాత చాలాకాలం పాటు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకున్నాను. ఆ తరువాత జనరేషన్ గ్యాప్ వస్తుందని భావించి నేను పక్కకి తప్పుకున్నాను. ఇప్పుడు నాగార్జున ఆ వ్యవహారాలు చూసుకుంటున్నాడు” అని చెప్పారు.