ఐటీ దాడులు చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నాయని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తనకు సంబంధించి ముప్పై ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారని, కానీ వారికి ఏమీ దొరకలేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా తనపై ఐటీ దాడులు నిర్వహించాయన్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అనంతరం విచారణ నిమిత్తం హైదరాబాద్ రావాలని పొంగులేటి కుటుంబ సభ్యులకు ఐటీ అధికారులు సూచించారు. ఐటీ అధికారులు రావాలని చెప్పడంతో పొంగులేటి భార్య, తనయుడు, సోదరుడు హైదరాబాద్ బయలుదేరారు.
ఉదయం ఐదు గంటల నుంచి ఐటీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను, సిబ్బందిని విడివిడిగా విచారించారు. మరోవైపు, పొంగులేటి ఇంటి ముందు ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల నిరసన తెలిపారు. ఉపేందర్ అనే కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుడి ప్రయత్నాన్ని తోటి కార్యకర్తలు అడ్డుకున్నారు.