Take a fresh look at your lifestyle.

మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీ సీఎం అభ్యర్థి ఎవరు ?

0 362

బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని, మరి మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఆర్మూర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆశన్న గారి జీవన్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇచ్చిన సందర్భంగా మొదటిసారి నియోజకవర్గానికి రావడంతో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ వ్యవసాయానికి మూడు గంటలు మాత్రమే కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ కావాలా లేదా 24 గంటల నిరంతర విద్యుత్తు అందిస్తున్న సీఎం కేసీఆర్ కావాలా అన్నది రైతులు ఆలోచించుకోవాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్ల పెట్టమంటున్నదని మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనలకు రూ. 15 లక్షల రుణమాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం రైతు రుణమాఫీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు.

ఆర్మూర్ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి విచ్చేసిన కవిత పెర్కిట్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగించారు.

మూడో సారీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ పొందిన తర్వాత మొదటి సారి జీవన్ రెడ్డి ఆర్మూర్ కు వచ్చారని, ఆయనను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 2014లో మొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించుకున్నామని గుర్తు చేశారు. “ఏ ఫర్ ఆర్మూర్ , ఏ ఫర్ ఆశన్నగారి జీవన్ రెడ్డి” అని వ్యాఖ్యానించారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యే గా గెలపొంది జీవోల జీవన్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారని, రెండో సారి 30 వేల మెజారిటీతో ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారని తెలిపారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారని, ఈ సారి కచ్చితంగా 60 వేల మెజారిటితో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాదిన్నర కాలం నుంచి జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ తోనే ఉంటున్నారని, నీడలాగా నిరంతరం సీఎంతో కలిసి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే, ఆకుల లలిత పార్టీలో చేరిన తర్వాత ఆమెను గౌరవించుకున్నామని, ఆమెకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డిని ఆశీర్వదించిన ఆకుల లలిత మరింత ఉన్నత స్థానంలో ఉంటారని తెలిపారు.

ఆలూరు, డొంకేశ్వర్ ను మండల కేంద్రంగా చేశామని, ఆర్మూర్ ను రెవెన్యూ డివిజన్ చేసుకున్నామని వివరించారు. చెప్పిన ప్రతీ ఒక్కటి చేసుకుంటూ వచ్చామని, చెప్పిన పని చేస్తూ నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తున్నాము కాబట్టి ఒక హక్కుతోప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవసాయానికి కేవలం మూడు గంటల విద్యుత్తు సరిపోతుందని అంటున్నారని, మూడు గంటల కరెంట్ సరిపోతుందా అని ప్రశ్నించారు. మూడు గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా లేదా 24 గంటల నిరంతర కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా అన్నది ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ వాళ్లేమో మూడు గంటల కరెంట్ చాలంటే… బీజేపీ వాళ్లేమో మోటార్లకు మీటర్లను పెట్టమంటున్నారని విమర్శించారు. దాదాపు రూ. 15 లక్షల కోట్ల మేర కార్పొరేట్ కంపెనీలకు రుణాలను మాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని స్పష్టం చేశారు. బీజేపీ మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తసుకొస్తే వాటిపై జరిగిన పోరాటంలో 850 మంది రైతులు మరణిస్తే వాటిని వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మనకు దోస్తుకాదని, ప్రజలతో కొనసాగే ఒకఒకే వ్యక్తి సీఎం కేసీఆర్ అని, ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ అని తేల్చిచెప్పారు. “మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్… మరి మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ?” అని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రశ్నించారు. 2014లో ప్రజలకు తమ పార్టీకి 63 సీట్లు ఇచ్చారని, 2019లో 88 సీట్లు ఇచ్చారని, ఈ ఎన్నికల్లో కచ్చితంగా 100కుపైగా ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మరొక్కసారి సీఎం కేసీఆర్ ను, జీవన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఆర్మూర్ రైతన్నలకు విజ్ఞప్తి చేశారు.

ఎర్రజొన్నలకు సంబంధించి 2007లో రైతులకు మోసం జరిగితే ధర్నా చేస్తున్న రైతుల మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరిపిందని, చాలా మంది రైతులు గాయపడ్డారని వివరించారు. అప్పుడు ఎర్రజొన్న రైతుల కోసం జీవన్ రెడ్డి 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారని, కేసీఆర్ వచ్చి దీక్షను విరమించజేశారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎర్రజొన్న రైతులకు ఇవ్వాల్సిన రూ. 13 కోట్లు విడుదల చేస్తామని ఆ సందర్భంగా సీఎం కేసీఆర్ 2007లో ప్రకటించారని, 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు రూ. 13 కోట్లను తాను, జీవన్ రెడ్డి కలిసి రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. రైతుల పక్షాన నిలబడ్డ జీవన్ రెడ్డి కావాలా… లేది ఇతర పార్టీలు కావాలా అన్నది రైతులు ఆలోచించాలని కోరారు. తాగునీటి కోసం రూ. 160 కోట్లు ఆర్మూర్ కు సీఎం ప్రకటించారని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ తో కలిసి జీవన్ రెడ్డి క్రియాశీలకంగా పనిచేశారని, ఉద్యమ సమయంలో డీ శ్రీనివాస్ జన్మదిన వేడుకల కోసం ప్రణబ్ ముఖర్జీ, లగడపాటి రాజగోపాల్ వంటి కాంగ్రెస్ నేతలు నిజామాబాద్ కు వస్తుంటే రహదారిపై టైర్లు కాల్చివేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం కోసం నిరంతరం పని చేసిన జీవన్ రెడ్డి కావాలా… లేదా ఇతర పార్టీలు కావాలా అని అడిగారు.

Leave A Reply

Your email address will not be published.