Take a fresh look at your lifestyle.

వైవాహిక అత్యాచారం.. వివాహ వ్యవస్థకు ప్రమాదకరం

0 222

న్యూ డిల్లీ : వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరుపనున్నది. రాజ్యాంగ బెంచ్‌ ముందున్న జాబితా చేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎదుట న్యాయవాది ప్రస్తావించగా.. ఈ విషయాలను ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించాల్సి ఉందని, ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కొన్ని లిస్టెడ్‌ అంశాలను విచారించిన తర్వాత జాబితా చేస్తామని సీజేఐ తెలిపారు.
గతంలో ఢల్లీి హైకోర్టులో విచారణ..
ఇదిలా ఉండగా.. అయితే, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని డిమాండ్‌ చేస్తూ ఇద్దరు ఢల్లీి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నమైన తీర్పును వెలువరించింది. భార్య సమ్మతి లేకుండా ఆమెతో సంభోగం చేయడం నేరంగా పరిగణించాలన్న పిటిషనర్ల వాదనలతో జస్టిస్‌ శక్ధర్‌ ఏకీభవించారు. ‘భారతీయ శిక్షాస్మృతి నిబంధనల కారణంగా ఈ విషయంలో భర్తలను మినహాయించడం ‘అత్యంత సమస్యాత్మకం’ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు.
సెక్స్‌ వర్కర్లు, భర్తల నుంచి విడిపోయిన భార్యలకు.. అత్యాచార నిరోధక చట్టం కింద నిందితులపై కేసులు పెట్టి, విచారణ కొనసాగించే హక్కు ఉంది. కానీ, తన అంగీకారం లేకుండా భర్త తనపై లైంగిక చర్యలకు పాల్పడినందుకు అతనిపై ప్రాసిక్యూషన్‌ ప్రారంభించే హక్కు మాత్రం భార్యలకు లేదు. రుతుక్రమం, పలు కారణాలతో భర్తతో సంభోగానికి దూరంగా ఉండాలని భార్య భావిస్తుంటుంది. పలు సందర్భాల్లో భర్తకు హెచ్‌ఐవీ తదితర లైంగిక వ్యాధులు ఉన్నాయని తెలిసిన సమయంలో సంభోగానికి నిరాకరించేందుకు అవకాశం ఉంటుంది.
ఇలాంటి సందర్భాల్లో భర్త చేసే గాయం తక్కువ హానికరమో, తక్కువ అమానవీయమో అవ్వదు. వైవాహిక అత్యాచారం కూడా శారీరక గాయాలతో పాటు మానసికంగానూ లోతైన గాయాలు చేస్తుంది’ పేర్కొన్నారు. అయితే, దీనిపై జస్టిస్‌ హరిశంకర్‌ మాత్రం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. మహిళల లైంగిక స్వేచ్ఛ రాజీపడే అంశం కాదని, నైతికంగా, చట్టపరంగా, ఆధ్యాత్మికంగా, ఇతర అన్ని విషయాల్లోనూ పురుషులతో సమానమేనని పేర్కొన్నారు. భార్యతో సంభోగం విషయంలో చట్ట నిబంధనలు భర్తకు కల్పిస్తున్న మినహాయింపు రాజ్యాంగ విరుద్ధం కాదని, దాంతో ప్రాథమిక హక్కులకు విఘాతం కలగడం లేదని జస్టిస్‌ హరిశంకర్‌ పేర్కొన్నారు.
2017లోనే కేంద్రం అఫిడవిట్‌..
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే విషయమై.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధీకులు అందరితోనూ అర్థవంతమైన, నిర్మాణాత్మక సంప్రదింపులు చేపట్టాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ఢల్లీి హైకోర్టుకు నివేదించింది. సామాజిక, చట్టపరమైన చిక్కులతో ముడిపడిన ఈ అంశంపై.. సంప్రదింపుల తర్వాతే ప్రభుత్వం ఏదైనా సాయం చేయగలదని చెప్పింది. ఆయా పిటిషన్లపై విచారణను వాయిదా వేయాలని కోరగా.. ఇందుకు కోర్టుకు నిరాకరించింది. 2017లో ఈ కేసు విచారణ సందర్భంగా అఫిడవిట్‌ దాఖలుచేసిన కేంద్ర ప్రభుత్వం? వైవాహిక అత్యాచారం నేరం కాదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. దీన్ని నేరంగా పరిగణిస్తే భర్తలను వేధించేందుకు ఇది సులభమైన సాధనంగా మారి, వివాహ వ్యవస్థ అస్థిరతకు గురయ్యే ప్రమాదముందని అఫిడవిట్‌లో అభిప్రాయపడిరది.
కేసు వివరాల్లోకి వెళితే..
భారత శిక్షాస్మృతిలోని 375వ నిబంధన (అత్యాచారం) నుంచి వైవాహిక అత్యాచారాన్ని మినహాయించడంతో, దాన్ని రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ ఢల్లీి హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సెక్షన్‌ 375లోని మినహాయింపు ప్రకారం.. భార్య మైనర్‌ కానప్పుడు, ఆమెతో భర్త సంభోగంలో పాల్గొనడాన్ని అత్యాచారంగా పరిగణించరు. అయితే, దీన్ని సవాల్‌ చేస్తూ అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘంతో పాటు ఆర్‌ఐటీ ఫౌండేషన్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశాయి. భార్య అనుమతి లేకుండా ఆమెతో భర్త జరిపే లైంగిక చర్యలు అత్యాచారంతో సమానమని, వైవాహిక అత్యాచారాన్ని సైతం నేరగంగా పరిగణించి, దోషులను శిక్షించాలని కోరగా.. జస్టిస్‌ రాజీవ్‌ శక్ధర్‌, జస్టిస్‌ హరిశంకర్‌ ధర్మాసనం విచారణ జరిపింది. దంపతుల మధ్య లైంగిక సంపర్కాన్ని వివాహేతర దంపతుల మధ్య లైంగిక సంపర్కాన్ని వివాహేతర సంబంధంతో సమానంగా పరిగణించకూడదని మెన్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ వాదనలు వినిపించింది.

Leave A Reply

Your email address will not be published.