Take a fresh look at your lifestyle.

బియ్యం ఎగుమతులపై నిషేధం

0 270

ముంబై : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ‘బాస్మతీ ఏతర తెల్ల బియ్యం ఎగుమతుల నిబంధనలను సవరించాం. స్వేచ్ఛాయుత ఎగుమతుల్ని నిషేధిస్తున్నాం. ఇందులో పూర్తిగా మిల్లు పట్టిన, ఒక పోటు వరకే మిల్లు పట్టిన , పాలిష్‌ చేసిన, పాలిష్‌ చేయని బియ్యం ఉంటాయి’ అని డీజీఎఫ్‌టీ తెలిపింది.కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సాధారణ బియ్యం ఎగుమతులకు డీజీఎఫ్‌టీ అనుమతి ఇచ్చింది. నోటిఫికేషన్‌ రాక ముందే నౌకల్లోకి ఎక్కించిన బియ్యాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించింది. భారత ప్రభుత్వం చాలా రకాల బియ్యం ఎగుమతుల్ని నిషేదించబోతోందని బ్లూమ్‌ బర్గ్‌ న్యూస్‌ ఏజెన్సీ గతంలోనే రిపోర్టు ఇచ్చింది. భారత్‌ ఎగుమతి చేసే బియ్యంపై 80 శాతం వరకు నిషేధం ప్రభావం ఉంటుంది. దీంతో దేశంలో ధరలు తగ్గినా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతాయి.ఈ ఏడాది దేశంలో వర్షపాతం సవ్యంగా ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టి నెలకొనే అవకాశం ఉంది. దాంతో చివరి పది రోజుల్లోనే బియ్యం ధరలు 20 శాతం పెరిగాయి. వియత్నాం నుంచి ఎగుమతి చేసే బియ్యం ధరలు ఈ వారంలో దశాబ్దంలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ఎల్‌నినో ప్రభావం ఎలా ఉంటుందో తెలియకపోవడంతో కేంద్ర ప్రభుత్వం సైతం కఠిన చర్యలు తీసుకుంటోంది. ధరలు పెరగకుండా ముందు జాగ్రత్తగా ఎగుమతుల్ని నిషేధించింది. ఇలా చేయకపోతే ధరలు పెరుగుతాయని ట్రేడర్లు సైతం అంచనా వేశారు.రుతుపవనాలు రావడం.. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతుండటంతో భారత్‌లో వరినాట్లు ఊపందుకున్నాయి. రైతులు సాగు చేయడం మొదలు పెట్టారు. కాగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నూకలపై ప్రభుత్వం నిషేధం విధించింది. 2022 సెప్టెంబర్‌ నుంచి వేర్వేరు గ్రేడ్ల బియ్యంపై 20 శాతం సుంకం విధించింది. ‘ప్రభుత్వం ధాన్యం సేకరణ ధరలను పెంచడంతోనే బియ్యం ధరలు పెరుగుతున్నాయి. కానీ సంక్షేమ పథకాలకు అవసరమైన దానికన్నా ఎక్కువ బియ్యాన్ని ప్రభుత్వం నిల్వ చేసింది. అలాంటప్పుడు ఎగుమతుల్ని నిషేధించాల్సిన అవసరమే లేదు’ అని బియ్యం ఎగుమతుల సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారావు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.