రాజ్ కుంద్రా, పూనమ్ పాండేకి యాంటిసిపేటరీ బెయిల్

సినిమాల్లో అవకాశాల కోసం వచ్చే అమాయక యువతులతో పోర్న్ వీడియోలు తీస్తూ, వాటిని ప్రత్యేక యాప్ ద్వారా ప్రసారం చేస్తున్నట్టు వ్యాపారవేత్త రాజ్ కుంద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ ( అరెస్ట్ నుంచి ఉపశమనం) ను సుప్రీంకోర్టు మంగళవారం మంజూరు చేసింది. ఇదే కేసులో నటులు పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా, మరో ఇద్దరికి కూడా యాంటిసిపేటరీ బెయిల్ లభించింది.

వీరంతా పోర్నోగ్రఫీ కంటెంట్ ప్రసారంలో ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. కేసు దర్యాప్తునకు సహకరించాలని వీరిని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కేసులో చార్జ్ షీటు ఇప్పటికే దాఖలైందని, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్టు నిందితుల్లో ఒకరి తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. పోర్నోగ్రఫీ కంటెంట్ కేసులో నటి శిల్పాశెట్టి భర్త అయిన రాజ్ కుంద్రా 2021 జులైలో అరెస్ట్ అయి, ఆ తర్వాత బెయిల్ పై విడుదలవ్వడం తెలిసిందే. ఓ బాధిత మహిళ ముంబై పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.

Leave A Reply

Your email address will not be published.