అవును.. అల్ జవహరిని చంపేశాం: జో బైడెన్

అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని హతమార్చినట్టు వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ధ్రువీకరించారు. కాబూల్‌లో డ్రోన్ దాడి నిర్వహించి అతడిని అంతమొందించినట్టు అధికారికంగా ప్రకటించారు. అమెరికా ప్రజలకు హాని తలపెట్టిన వారు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఎంతకాలమైనా సరే మట్టుబెట్టి తీరుతామని బైడెన్ స్పష్టం చేశారు. ఆప్ఘన్ రాజధాని కాబూల్‌లో అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) నిన్న జరిపిన డ్రోన్ దాడిలో జవహరి హతమైనట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలను బైడెన్ నిర్ధారించారు.

11 సెప్టెంబరు 2001లో అమెరికా ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా జరిపిన దాడిలో దాదాపు 3 వేల మంది మరణించారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారైన అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి హతమార్చింది. ట్విన్ టవర్స్‌పై దాడిలో మరో సూత్రధారైన అల్‌ జవహరిని ఇప్పుడు మట్టుబెట్టింది. అతడి తలపై 25 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ఉంది. మరోవైపు, తమ భూభాగంలో అమెరికా డ్రోన్ దాడి జరిపి జవహరిని హతమార్చడాన్ని ఆప్ఘనిస్థాన్‌లోని అధికార తాలిబన్ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. అమెరికా చర్య అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Joe Biden, America, Ayman al-Zawahri, Afghanistan

Leave A Reply

Your email address will not be published.