కోమటిరెడ్డి సోదరులు కలిసి ఉంటే ఎదురుండదనే మాపై దుష్ప్రచారం: రాజగోపాల్‌రెడ్డి

  • ఓ వర్గం మీడియాను వాడుకుంటున్నారు
  • మా మధ్య మనస్పర్థలు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు
  • ఇంటికి కిలో బంగారం పంచినా కేసీఆర్ అధికారంలోకి రాలేరన్న రాజగోపాల్ 
కోమటిరెడ్డి సోదరులు ఒక్కటిగా ఉంటే నల్గొండలో ఎదురుండదని భయపడుతున్న కొందరు తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు ఓ వర్గం మీడియాను ఉసిగొల్పుతున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఆ మీడియా ద్వారా తమ మధ్య మనస్పర్థలు ఉన్నట్టు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
కాంగ్రెస్‌లో సమర్థులైన నాయకులకు కొదవ లేదని, ఎవరి నియోజకవర్గాల్లో వారు పాదయాత్రలు చేస్తే ఈజీగా గెలుస్తామని అన్నారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా రాజగోపాల్‌రెడ్డి విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఇంటికి కిలో బంగారం చొప్పున పంచిపెట్టినా కేసీఆర్ అధికారంలోకి రాలేరని అన్నారు. కేసీఆర్ గురించి, ప్రభుత్వ అవినీతి గురించి ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు. కాగా, నేటి మధ్యాహ్నం 12 గంటలకు భట్టి విక్రమార్క అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది.

Leave A Reply

Your email address will not be published.